Police: ముంబయి-సింగపూర్ విమానానికి బాంబు బెదిరింపు.. రక్షణగా వెళ్లిన ఎఫ్-16 యుద్ధ విమానాలు!
- విమానంలో 263 మంది ప్రయాణికులు
- వెంటనే స్పందించిన సింగపూర్ ప్రభుత్వం
- సురక్షితంగా ల్యాండైన విమానం
సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ముంబయి నుంచి సింగపూర్ వెళుతున్న ఆ విమానం గాల్లోకి లేచిన తర్వాత విమానంలో బాంబు ఉందంటూ ఎయిర్ లైన్స్ కార్యాలయానికి ఫోన్ కాల్ వచ్చింది. ఈ విషయాన్ని సింగపూర్ లో ఉన్న సంస్థ ప్రధాన కార్యాలయం సీరియస్ గా తీసుకుని అక్కడి ప్రభుత్వానికి సమాచారం అందించింది. విమానంలో ఆ సమయంలో 263 మంది ప్రయాణికులు ఉండడంతో వాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తమైంది.
ఈ విషయంలో సింగపూర్ ప్రభుత్వం తక్షణమే స్పందించి, తమ ఎయిర్ ఫోర్స్ కి చెందిన రెండు ఎఫ్-16 విమానాలను ముంబయి-సింగపూర్ విమానానికి రక్షణగా పంపించింది. అనంతరం స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయానికల్లా ఆ విమానం సింగపూర్ లోని చాంగీ ఎయిర్ పోర్టులో సురక్షితంగా ల్యాండైంది. ప్రయాణికులందరినీ తనిఖీలు చేసిన భద్రత అధికారులు ఓ మహిళను, ఆమె చిన్నారిని మాత్రం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ మహిళను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.