Chandrababu: జూనియర్ ఎన్టీఆర్ మామ వ్యాఖ్యలపై ఒక చిన్న ఫొటోతో కౌంటర్ ఇచ్చిన నారా రోహిత్
- ఆ కథనాల్లో వాస్తవం లేదు
- సంక్రాంతికి కూడా కలుసుకున్నారు
- మా కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవు
ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై వ్యాఖ్యలు చేస్తూ, సొంత తమ్ముడు నారా రామ్మూర్తినాయుడి పరిస్థితి దెబ్బతినడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. చంద్రబాబు చేసిన మోసానికి ఆయనకు మతిభ్రమించడంతో గొలుసులతో ఓ గదిలో బంధించారని పేర్కొన్నారు.
దీనిపై రామ్మూర్తినాయుడు తనయుడు నారా రోహిత్ ఫేస్ బుక్ ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని, తమ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగానే ఉందని స్పష్టం చేశారు. అంతేగాకుండా, సంక్రాంతికి చంద్రబాబు నారావారిపల్లెలో సోదరుడు రామ్మూర్తినాయుడితో కలిసి ఉన్న ఫొటోను రోహిత్ పోస్టు చేశారు. ఆ ఫొటోలో చంద్రబాబు తన తమ్ముడు రామ్మూర్తి భుజంపై చేయివేసి ఎంతో వాత్సల్యంతో మాట్లాడుతున్న దృశ్యం కనిపిస్తోంది. రామ్మూర్తినాయుడు కూడా సంతోషంగా అన్న కళ్లలోకి చూస్తున్నారు. తమ కుటుంబంపై ప్రస్తుతం వినిపిస్తున్న కథనాలన్నీ నిరాధారమైనవని నారా రోహిత్ స్పష్టం చేశారు.