Andhra Pradesh: రామోజీరావును, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను కూడా కేసీఆర్ బెదిరించారా?: చంద్రబాబుకు జగన్ సూటిప్రశ్న
- నా చిన్నాన్నను చంద్రబాబే చంపించాడు
- ఆ తర్వాత మాపైనే బురద చల్లుతున్నారు
- ఐదేళ్ల పాలనపై ఓట్లడిగితే బాబుకు డిపాజిట్లు దక్కవు
- తాడిపత్రి బహిరంగ సభలో జగన్
తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే చంపించాడని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. చంద్రబాబు చెప్పని అబద్ధం, చేయని మోసం ఉండదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఆస్తులున్న ఏపీ వ్యాపారస్తులను, టీడీపీ మద్దతుదారులను తెలంగాణ సీఎం కేసీఆర్ బెదిరిస్తున్నారని చంద్రబాబు చెప్పడాన్ని వైసీపీ అధినేత తప్పుపట్టారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారులను బెదిరించడం నిజమే అయితే కేసీఆర్ ఈనాడు గ్రూపు అధినేత రామోజీరావును బెదిరించారా? అని జగన్ ప్రశ్నించారు. అలాగే ఆంధ్రజ్యోతి సంస్థ అధినేత వేమూరి రాధాకృష్ణను కూడా బెదిరించారా? అని చంద్రబాబును నిలదీశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. ‘చంద్రబాబు నాయుడుగారికి హైదరాబాద్ లో ఆస్తులు ఉన్నాయ్. మరి వాటిని కేసీఆర్ లాక్కున్నారా? అని అడుగుతున్నా. తన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణలో మనవాళ్లకు చంద్రబాబు అనే పెద్దమనిషి అపకారం చేస్తున్నారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తాను చేసిన అభివృద్ధిని చూసి, పాలనను చూసి ఓటేయమని కోరతారు.
కానీ ఇలా అడగలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారు. ప్రజలను ఓట్లు అడగలేక జగన్ అధికారంలోకి వస్తే ఏదో జరిగిపోతుంది. ఏదో జరిగిపోతుంది అని ప్రజలను బెదిరిస్తున్నారు’ అని దుయ్యబట్టారు. తన చిన్నాన్నను చంపించిన చంద్రబాబు.. ఆ బురదను తమపై చల్లుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనపై చర్చ జరిగితే ఆయనకు డిపాజిట్లు కూడా రావని వ్యాఖ్యానించారు. తన మీడియాలో గత 20 రోజులుగా ప్రజల దృష్టి మరల్చేలా కథనాలు రాయిస్తున్నారని మండిపడ్డారు.