YSRCP: అన్నీ తెలిసిన ఆ సీఐ ఎందుకలా ప్రవర్తించాడు?: వివేకా కుమార్తె సునీత విస్మయం

  • పోలీసులపై అనుమానాలు వస్తున్నాయి
  • ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారు
  • మీడియాతో మాట్లాడిన సునీతారెడ్డి

మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యానంతరం జరుగుతున్న పరిణామాలు తమకు ఆందోళన కలిగిస్తున్నాయని డాక్టర్ సునీతారెడ్డి వ్యాఖ్యానించారు. తన తండ్రి వివేకా హత్యకు గురై రోజులు గడుస్తున్నా ఇంతవరకు కేసులో పురోగతి లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆమె పోలీసుల తీరుపైనే తమకు అనుమానం వస్తోందని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు ఏ కోణంలో ముందుకెళుతున్నారో తెలియడంలేదని, వాళ్లనెవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా అనే సందేహాలు వస్తున్నాయని సునీత ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా, హత్య జరిగిన తర్వాత సీఐ శంకరయ్య వ్యవహరించిన విధానం తమకు చాలా అనుమానాలు రేకెత్తించిందని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ లో ఉన్న తమకే అది హత్య అని అనుమానం వస్తే, అక్కడ ఉన్న సీఐకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తన తండ్రి మృతదేహానికి కట్లు కట్టడం, ఆసుపత్రికి తరలించడం అంతా సీఐ సమక్షంలోనే జరిగిందని, ఆ సమయంలో ఆయన ఎందుకు జోక్యం చేసుకోలేదు? పంచనామా జరగకుండా శవానికి కట్లు కట్టడం తప్పని ఆయనకు తెలియదా? డెడ్ బాడీని తరలిస్తుంటే సీఐ ఎందుకు చూస్తుండిపోయారు? అంటూ సునీతారెడ్డి సందేహాలు వ్యక్తం చేశారు. ఆ సమయంలో తన బంధుమిత్రులు అక్కడే ఉన్నా వారు షాక్ లో ఉండిపోయారని, కానీ, అన్నీ తెలిసిన సీఐ శంకరయ్య తన విధినిర్వహణలో ఎందుకలా ప్రవర్తించాడో అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు.

రూల్స్ అన్నీ తెలిసిన వ్యక్తి ఆ సమయంలో ఏమీ మాట్లాడకపోవడాన్ని తాము ఎలా అర్థం చేసుకోవాలంటూ ప్రశ్నించారు. తన తండ్రి హత్యతో సీఐకి ప్రత్యక్ష సంబంధం ఉందా? అనే కోణంలో కూడా తమకు ఆలోచనలు వస్తున్నాయని అన్నారు. కాగా, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వివేకా హత్య కేసులో ఆధారాలు కాపాడడంలో విఫలమయ్యారని సీఐని రేంజ్ డీఐజీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News