Nara Lokesh: చంద్రబాబుకు 40 ఏళ్ల అనుభవం ఉంటే జగన్ కు జైల్లో కూర్చున్న అనుభవం ఉంది: నారా లోకేశ్ వ్యంగ్యం
- మన ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కు తాకట్టుపెట్టారు
- 25 స్థానాల్లో గెలిపిస్తే మనమే ప్రధానిని నిర్ణయిస్తాం
- మోదీ ఇంటికి వెళ్లే సమయం వచ్చింది
ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇవాళ కూడా అనేక ప్రాంతాల్లో ప్రచారం కొనసాగించిన లోకేశ్ ఈ సందర్భంగా జగన్, కేసీఆర్, మోదీలపై విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ ఒక్క అవకాశం ఇవ్వాలంటున్నాడని, ప్రజలు ఏం చూసి జగన్ కు ఓటేయాలని ప్రశ్నించారు.
చంద్రబాబుకు 40 ఏళ్ల పరిపాలనా అనుభవం ఉంటే జగన్ కు మాత్రం జైల్లో కూర్చున్న అనుభవం ఉందని వ్యంగ్యం ప్రదర్శించారు. హైదరాబాద్ లో ఉండే కేసీఆర్ అడుగులకు మడుగులొత్తుతున్న జగన్ రాష్ట్ర రాజధానిని మార్చేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ ఆరోపించారు. కేసీఆర్ చేతిలో కీలుబొమ్మగా మారిన జగన్, ఆయన ఎలా చెబితే అలా నడుచుకుంటున్నాడని మండిపడ్డారు.
జగన్ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కు తాకట్టుపెడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లకు కాపలాదారుగా ఉన్న మోదీ మళ్లీ గుజరాత్ కు వెళ్లే సమయం వచ్చిందని వ్యంగ్యం ప్రదర్శించారు. 25 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తే ప్రధాని ఎవరో చంద్రబాబే నిర్ణయిస్తారని లోకేశ్ ఉద్ఘాటించారు. విభజన హామీలు అమలు చేసేవారినే ప్రధానిని చేద్దాం అంటూ పిలుపునిచ్చారు.