Pawan Kalyan: పవన్ నేను పోటీ చేస్తున్నానని తెలిసి పాలకొల్లు నుంచి పారిపోయాడు: కేఏ పాల్
- పవన్, నాగబాబు నాకు తమ్ముళ్లు
- తమ్ముడిపై అభిమానంతోనే పోటీ
- భీమవరం నుంచే బరిలో దిగుతా
ప్రముఖ క్రైస్తవ మతప్రచారకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాటలకు ఆకాశమే హద్దులా కనిపిస్తోంది! తాజాగా, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గురించి చెబుతూ, మొదట పాలకొల్లు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాలనుకున్నాడని, కానీ తాను కూడా పాలకొల్లు నుంచి పోటీ చేస్తున్నట్టు తెలియగానే అక్కడ్నించి పారిపోయి భీమవరం చేరుకున్నాడని వ్యాఖ్యానించారు. అయితే పవన్ తనకు తమ్ముడిలాంటి వాడని, పవనే కాదు నాగబాబు కూడా తనకు తమ్ముడేనని తెలిపారు. తమ్ముడిపై అభిమానంతోనే పోటీ చేస్తున్నానని కేఏ పాల్ చెప్పారు. పవన్ కు పెద్దగా ఓటు బ్యాంక్ లేదని, ఓట్లు లేవని తెలిసి వామపక్షాలు, బీఎస్పీ వంటి పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. అయితే ప్రజాశాంతి పార్టీకి ప్రతి ఊళ్లోనూ వందకి 60 నుంచి 70 వరకు ఓట్లు ఉన్న విషయం అందరికీ తెలుసని అన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు.