Jagan: వైఎస్ జగన్ కు బహిరంగ లేఖ రాసిన కళా వెంకట్రావు
- అప్పుడు వైఎస్ మృతదేహంతో ఓట్లు అడిగావు
- ఇప్పుడు వివేకా మృతదేహంతో ఓట్లు దండుకుంటున్నావు
- తీవ్రస్థాయిలో మండిపడిన కళా
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కళా వెంకట్రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం ఆయన జగన్ కు బహిరంగ లేఖ రాశారు. అందులో జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ కుటుంబానిది మూడు తరాల నేరచరిత్ర అంటూ మొదలుపెట్టిన కళా, వివేకా హత్య విషయాన్ని కూడా తన లేఖలో ప్రస్తావించారు. వివేకా హత్య తర్వాత ఆధారాలను చెరిపేయడం కానీ, సంఘటన స్థలాన్ని శుభ్రం చేయడం, కడగడం కానీ చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.
పంచనామా జరగకుండానే శవానికి కట్లు కట్టడం తీవ్రనేరం అని తెలియదా? అంటూ నిలదీశారు. శవరాజకీయాలు చేయడంలో మీకు మీరే సాటి అంటూ జగన్ పై వ్యంగ్యం ప్రదర్శించారు. అయినా, మీ చిన్నాన్నను ఎవరు చంపారో మీకు తెలియదా? అంటూ ప్రశ్నించిన కళా, గతంలో మీ తండ్రి వైఎస్ మృతదేహాన్ని అడ్డంపెట్టుకుని ఓట్లు అడిగావు, ఇప్పుడు మీ బాబాయి వివేకా మృతదేహాన్ని అడ్డంపెట్టుకుని ఓట్లు దండుకుంటున్నావు అంటూ మండిపడ్డారు.
మీ కుటుంబ నేర చరిత్ర గురించి అందరికీ తెలుసని, అప్పట్లో వైఎస్ పై 34 కేసులు ఉన్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఆ తర్వాత మీవల్ల ఐఏఎస్ అధికారులు, ఇండస్ట్రియలిస్టులు జైలుకు వెళ్లింది నిజం కాదా? అంటూ కళా వెంకట్రావు తన లేఖలో నిలదీశారు. "గతంలో కడప సీటు కోసం సొంత బాబాయిపైనే దౌర్జన్యం చేశావు. సూట్ కేసు బాంబు వ్యవహారంలో శిక్షపడిన పులివెందుల కృష్ణ మీ మిత్రుడు కాదా? అలిపిరిలో చంద్రబాబుపై దాడిచేసిన గంగిరెడ్డి మీ మిత్రుడు కాదా? తేళ్లూరి వీరభద్రారెడ్డి మృతిపై మీ కుటుంబ సభ్యులు ఎప్పుడైనా స్పందించారా? గనుల వివాదంలో కొండారెడ్డిని మీరు బెదిరించింది నిజం కాదా? అంటూ కళా తన లేఖలో ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. అంతేకాదు, జగన్ 22 ఏళ్ల వయసులోనే సింహాద్రిపురంలో పోలీసు అధికారిపై దౌర్జన్యం చేశాడంటూ ఆరోపించారు.