Chandrababu: రాష్ట్రానికి జగనే అతి పెద్ద సమస్య: చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు
- లక్ష కోట్లు దోచుకున్న ఘనుడు జగన్
- వైఎస్ వివేకా హత్య ఎవరింట్లో జరిగింది?
- చివరికి లేఖ కూడా సృష్టించారు
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పై నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి అతిపెద్ద సమస్య జగనే అని విమర్శించారు. ఈ ఐదేళ్లు, అంతకుముందు కూడా జగన్ గురించి అందరికీ తెలుసని, తండ్రిని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు దోచిన ఘనుడు జగన్ అని ఆరోపించారు. వాళ్ల ఇంట్లోనే వివేకా హత్యకు గురైతే గుండెపోటుతో చనిపోయినట్టు చిత్రీకరించారని చంద్రబాబు ఆరోపించారు. అది కుటుంబంలో జరిగిన హత్యేనని స్పష్టం చేశారు. సాక్ష్యాలు తారుమారు చేయడానకి రక్తపు మరకలన్నీ కడిగేసి బెడ్ షీట్లు మార్చేశారని విమర్శించారు. జగన్ వ్యవహారాలన్నీ బయటపెట్టిన వ్యక్తి ఇప్పుడు విశాఖ పార్లమెంటు స్థానానికి పోటీచేస్తున్నారని, ఆయన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అని చెప్పారు. ఇప్పుడైనా లక్ష్మీనారాయణ నోరు విప్పి జగన్ గురించి అన్ని వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పాలని డిమాండ్ చేశారు.