China: కారుతో పాదచారులను ఢీకొట్టి తొక్కించిన ఉన్మాది.. రోడ్డుపైనే కాల్చిచంపిన పోలీసులు!

  • చైనాలోని హుబై ప్రావిన్సులో ఘటన
  • దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం
  • లొంగిపోయేందుకు నిరాకరించిన నిందితుడు

చైనాలో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న పాదచారులే లక్ష్యంగా తన కారుతో తొక్కించుకుంటూ దూసుకెళ్లాడు. ఈ  దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా, మరో ఏడుగురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సదరు దుండగుడిని కాల్చిచంపారు. చైనాలోని హుబై ప్రావిన్సులో ఈ ఘటన చోటుచేసుకుంది.

హుబై ప్రావిన్సులోని జోయాంగ్ నగరంలో ఈరోజు ఓ వ్యక్తి(40) కారులో వేగంగా దూసుకొచ్చాడు. రద్దీగా ఉన్న జంక్షన్ లో పాదచారులు వెళుతుండగా, వారిని బలంగా ఢీకొట్టాడు. అక్కడితో ఆగకుండా కిందపడిపోయినవారిని తొక్కించుకుంటూ ముందుకెళ్లాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు లొంగిపోవాల్సిందిగా అతడిని కోరారు. అయితే అతను మరోసారి కారుతో ఢీకొట్టించేందుకు సిద్ధం కావడంతో తుపాకీతో కాల్చిచంపారు.

అనంతరం అతని కారు నుంచి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై ఓ పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. నిందితుడు గతంలో పలు నేరాలు చేశాడని తెలిపారు. చైనాలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. గతేడాది సెప్టెంబర్ లో హునన్ ప్రావిన్సులో ఓ వ్యక్తి తన కారుతో ఢీకొట్టించి 11 మందిని హతమార్చాడు. మరో రెండు నెలలకే లియోనింగ్ ప్రావిన్సులో రోడ్డు దాటుతున్న స్కూలు చిన్నారులపైకి ఓ కారు దూసుకొచ్చింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు పిల్లలు చనిపోగా, 19 మంది గాయపడ్డారు.

China
Police
hubei
car
Road Accident
shoot
  • Loading...

More Telugu News