Telugudesam: ఆ ముగ్గురికీ చుక్కెదురు...మూడు పార్టీల లోక్‌సభా పక్షం నేతలకు దక్కని టికెట్లు
- తోట, మేకపాటి, జితేందర్ రెడ్డిలకు టికెట్లు నిరాకరణ
- చట్ట సభలో వాణి వినిపించినా పట్టించుకోని అధినేతలు
- ముగ్గురూ ప్రాంతీయ పార్టీల నేతలే
రాజకీయాల్లో అంతే...ఓడలు బళ్లు, బళ్లు ఓడలు అవుతాయంటారు. నిన్నమొన్నటి వరకు లోక్ సభలో ప్రజా సమస్యలపై పార్టీ పక్షం నేతలుగా తమ గొంతు వినిపించిన వారు ఆ ముగ్గురూ. అధిష్ఠానం ఆదేశాలను తుచ తప్పకుండా పాటిస్తూ పార్టీ వాణిని చట్టసభలో వినిపించి, పరపతి పెరిగేందుకు తమవంతు దోహదపడ్డారు.
తీరా ఎన్నికలు వచ్చేసరికి అధిష్ఠానం టికెట్టు నిరాకరించడంతో డీలాపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లోని తెలుగుదేశం, వైసీపీ, టీఆర్ఎస్ సభాపక్షం నేతల పరిస్థితి ఇది. పదహారవ లోక్‌సభలో టీడీపీ పక్షం నేతగా తోట నరసింహం వ్యవహరించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో అనారోగ్య కారణాల వల్ల తాను పోటీ చేయలేనని, తన భార్యకు టికెట్టు ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరారు. సానుకూల స్పందన లేకపోవడంతో పార్టీ వీడి వైసీపీలో చేరారు.
ఇక, వైసీపీ లోక్ సభా పక్షం నేతగా వ్యవహరించిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి నెల్లూరు నుంచి పోటీ చేయాలని ఆశించారు. కానీ అధిష్ఠానం అవకాశం ఇవ్వలేదు. టీడీపీ నుంచి వచ్చి చేరిన ఆదాల ప్రభాకరరెడ్డికి ఆ స్థానాన్ని కట్టబెట్టింది. దీంతో మేకపాటికి నిరాశ తప్పలేదు.
ఇక, తెలంగాణ రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ లోక్‌సభా పక్షం నేతగా జితేందర్‌రెడ్డి వ్యవహరించారు. ఈయన మహబూబ్‌నగర్ స్థానం నుంచి మళ్లీ పోటీ చేయాలని ఉవ్విళ్లూరారు. కానీ సీఎం కేసీఆర్ మన్నె శ్రీనివాసరెడ్డికి పోటీ చేసే అవకాశం ఇచ్చి జితేందర్‌రెడ్డికి ఝలక్ ఇచ్చారు. మొత్తమ్మీద మూడు ప్రాంతీయ పార్టీల లోక్‌సభాపక్షం నేతలకు మరోసారి తమ వాణి వినిపించే అవకాశం లేకుండా పోయింది.