Nadyal: గెలిచింది వైసీపీ నుంచి... ఫిరాయించింది టీడీపీలోకి... ఇప్పుడు జనసేన నుంచి నామినేషన్!
- నంద్యాల నుంచి హ్యాట్రిక్ సాధించిన ఎస్పీవై రెడ్డి
- 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచి టీడీపీలోకి
- టికెట్ నిరాకరించిన చంద్రబాబునాయుడు
ఆయన మూడుసార్లు వరుసగా విజయం సాధించిన హ్యాట్రిక్ నేత. అయితేనేం, ఈ దఫా ప్రధాన పార్టీల నుంచి టికెట్ లభించలేదు. దీంతో ఆయన తొలుత స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావించి, చివరకు జనసేనలో చేరి, ఆ పార్టీ తరఫున బరిలోకి దిగారు. ఆయనే నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున విజయం సాధించి, ఆ వెంటనే టీడీపీలోకి ఫిరాయించిన ఎస్పీవై రెడ్డికి, ఈ ఎన్నికల్లో అధినేత చంద్రబాబు టికెట్ ను నిరాకరించిన సంగతి తెలిసిందే.
దీంతో తనవంటి సీనియర్ నేతను పక్కన బెట్టడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అప్పటికే వైసీపీలో సైతం బర్త్ లు నిండిపోవడంతో ఎస్పీవై రెడ్డి జనసేనలో చేరిపోయారు. తాజాగా, ఆయన నంద్యాల లోక్ సభకు జనసేన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమార్తె సుజల, అల్లుడు శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.