Chandrababu: మూడు లాంతర్ల సెంటర్లో వైఎస్ విజయమ్మ గురించి మాట్లాడిన చంద్రబాబు
- వైజాగ్ లో ఆస్తులు లెక్కేసుకున్నారు
- చివరికి ఓటమిపాలయ్యారు
- అందుకే వైజాగ్ ప్రశాంతంగా ఉందంటూ వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అలుపెరుగని ఉత్సాహంతో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. విజయనగరం జిల్లాలో పలుచోట్ల రోడ్ షోలు, సభలు నిర్వహించిన ఆయన గురువారం రాత్రి విజయనగరం పట్టణంలోని మూడు లాంతర్ల సెంటర్ లో అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ క్రమంలో, వైఎస్ విజయమ్మ గురించి ప్రస్తావించారు. గత ఎన్నికల సమయంలో విజయలక్ష్మి విశాఖపట్నంలో పోటీచేసినప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. ఆమె బరిలో దిగేటప్పుడే వైజాగ్ లో ఎక్కడెక్కడ విలువైన ఆస్తులు ఉన్నాయో చూసుకున్నారని, కానీ వైజాగ్ ప్రజలు ఆమె తీరు చూసి భయపడిపోయి చిత్తుచిత్తుగా ఓడించి తిరుగుటపాలో పంపించేశారని ఎద్దేవా చేశారు. విజయలక్ష్మి ఓడిపోవడంతో వైజాగ్ నగరం ప్రశాంతంగా ఉందని సెటైర్ వేశారు.
ఇప్పుడు జగన్ కు ఓటేస్తే ఇంటికో రౌడీ తయారవుతాడని, పూటకో రౌడీ పుట్టుకొస్తాడని విమర్శించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి గుణపాఠం నేర్పారో ఇప్పుడు వైసీపీకి కూడా అదే గతి పట్టించాలని అన్నారు. కేసీఆర్ తనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పాడని, ఇప్పుడు జగన్ కు రూ.1000 కోట్లు ఇవ్వడం ద్వారా రిటర్న్ గిఫ్ట్ పంపించాడని తెలిపారు. మన రాష్ట్రంపై కుట్రలు, కుతంత్రాలు చేస్తే ఏపీ పౌరుషాన్ని చూపిస్తామని హెచ్చరించారు. జగన్ ఇప్పుడు కేసీఆర్ చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడని, జగన్ కు తప్పుడు పనులు చేయడం అలవాటని, నేరాలు చేయడంలో దిట్ట అని ఆరోపించారు. కోడికత్తి పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి నిలిచిపోతుందని చెప్పారు.