Hyderabad: ఇంటిపైకప్పు కూలి పది నెలల చిన్నారి మృతి
- పాలుతాగి నిద్రిస్తున్న పాపపై పడిన శిథిలాలు
- సిమెంటు పనులు చేస్తుండగా ఘటన
- హతాశులైన తల్లిదండ్రులు
పాలుతాగి హాయిగా నిద్రపోతున్న పదేళ్ల చిన్నారికి అదే శాశ్వత నిద్ర అయింది. పనులు చేపడుతుండగా రిటైనింగ్ వాల్, ఇంటి పైకప్పు ఒకేసారి కుప్పకూలడంతో అక్కడికక్కడే మృత్యువాత పడింది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హకీంపేట కుంట సమీపంలోని ఖాసీం ఖురేషి (30), యాకుం సుల్తానా (26) దంపతులు తమ పది నెలల చిన్నారి మయాన్ ఖురేషీతో నివసిస్తున్నారు. అదే ఇంట్లో ఖాసీం సోదరుడి కుటుంబ సభ్యులు మరో నలుగురు కలిసి మొత్తం ఏడుగురు ఉంటున్నారు. ఈ ఇంటిని ఆనుకుని మరో ఏడిళ్లు ఉన్నాయి. ఈ ఇళ్లను అనుకుని వెనుక భాగంలో ఐదడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవున రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నారు. నిర్మాణ సమయంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు తీసుకోలేదు.
ఉదయం 7.30 గంటల సమయంలో కాంక్రీట్ పనులు చేపడుతుండగా హఠాత్తుగా రక్షణ గోడ కూలి చిన్నారి నిద్రిస్తున్న రేకుల షెడ్డుపై పడింది. దీంతో రేకులు ధ్వంసమై గోడ శిథిలాలతోపాటు, రేకులు చిన్నారిపై పడడంతో వాటి కింద చిక్కుకుని బిడ్డ చనిపోయింది. ఆ సమయంలో మిగిలిన కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో వారికి ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో వరుసగా నాలుగు ఇళ్లు దెబ్బతిన్నాయి. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు బాధ్యులపై కేసు నమోదు చేశారు.