: మనకు మరో సునామీ...?!
సునామీ పేరు వినగానే వెన్నులో వణుకు పుడుతుంది. అది సృష్టించిన బీభత్సం ఒక్కసారిగా కళ్లముందు కదలాడుతుంది. అలాంటి సునామీ మళ్లీ వచ్చే అవకాశాలున్నాయంటున్నారు సౌతాంప్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. సముద్రంలో ఏర్పడిన భూకంపం మూలంగా గతంలో సునామీ ఏర్పడింది. దీంతో సముద్రాలపై పరిశోధనలు ప్రారంభించారు. ఈ పరిశోధనల ఫలితంగా, భవిష్యత్తులో హిందూమహాసముద్రంలోని పశ్చిమ తీరంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
2004లో సమత్రాలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 9.1గా నమోదయింది. భవిష్యత్తులో హిందూ మహాసముద్రంలో సంభవించే భూకంప తీవ్రత కూడా ఇదే స్థాయిలో ఉండే అవకాశం ఉందని వీరు చెబుతున్నారు. దీని ప్రభావం భారత్, పాకిస్థాన్ దేశాలపై ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో భూకంప ముప్పును గురించి చేసిన అధ్యయనాల్లో భూకంప తీవ్రతను గురించి శాస్త్రవేత్తలు తక్కువగా అంచనా వేశారని, ఇంకా ఈ ప్రాంతాల్లో లోతుగా అధ్యయనం చేయాల్సివుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. మక్రాన్ మడక్షన్ జోన్ పరిధిలో ఉన్న భారత్, పాకిస్థాన్, ఇరాన్, ఒమన్ దేశాల్లోని తీరప్రాంతాలకు సునామీ ముప్పు పొంచి వుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.