KTR: అసెంబ్లీ ఎన్నికల్లో చెల్లని రూపాయి పార్లమెంట్ ఎన్నికల్లో చెల్లుతుందా?: కాంగ్రెస్ పై కేటీఆర్ సెటైర్
- కాంగ్రెస్ సంక్షోభంలో ఉంది
- అదను చూసి దెబ్బకొట్టాలి
- టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యాఖ్యలు
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తన విమర్శలకు మరింత పదును పెట్టారు. ఆదిలాబాద్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు అనిల్ జాదవ్ టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో చెల్లని రూపాయి పార్లమెంటు ఎన్నికల్లో చెల్లుతుందా? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన నాయకులకే ఇప్పుడు ఎంపీ టికెట్లు ఇస్తోందంటూ కాంగ్రెస్ ను విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సంక్షోభంలో పడిపోయిందని, అదను చూసి దెబ్బకొట్టాల్సిన సమయం ఇదేనంటూ పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలు ఎంతో కీలకమైనవని, కాంగ్రెస్, బీజేపీలకు వాత పెట్టాల్సిన సమయం ఇదేనని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులకు ఓటేస్తే మోదీ, రాహుల్ లాభపడతారని, టీఆర్ఎస్ కు ఓటేసి 16 మంది ఎంపీలను ఢిల్లీ పంపిస్తే తెలంగాణ లాభపడుతుందని చెప్పారు. మోదీ, రాహుల్ లాభపడాలా? తెలంగాణ లాభపడాలా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.