Andhra Pradesh: ఏపీలో ఏకపక్ష ఎన్నికలు అవసరం, అందరూ టీడీపీకే ఓట్లెయ్యాలి: సీఎం చంద్రబాబు పిలుపు
- ఏపీ అభివృద్ధికి ఎంతగానో పాటుపడుతున్నా
- నవ్యాంధ్రప్రదేశ్ కుటుంబ పెద్దగా శక్తి అంతా ఉపయోగిస్తా
- జగన్ కి ఓటేస్తే మరణశాసనం రాసుకున్నట్టే
ఏపీ అభివృద్ధికి ఎంతగానో పాటుపడుతున్నానని, ఇక్కడ ఏకపక్ష ఎన్నికలు అవసరమని, ఓటర్లందరూ టీడీపీకి ఓటెయ్యాల్సిన అవసరం ఉందని, ఈ విషయమై అందరూ ఆలోచించాలని సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో నిర్వహిస్తున్న టీడీపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నానని, ఇప్పుడు చిన్న రాష్ట్రానికి సీఎంను అని అన్నారు.
ఆ రోజున సమైక్య రాష్ట్రానికి న్యాయం చేశానని, ఈరోజున నవ్యాంధ్రప్రదేశ్ కుటుంబ పెద్దగా తన శక్తి అంతా ఉపయోగించి అందరినీ ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ఓటు వేస్తే మరణశాసనం రాసుకున్నట్టేనని, ఆయనకు వేసే ఓటు మోదీకి వేసినట్టేనని, జగన్ కు ఓటేస్తే ఏపీ ప్రజలకు భద్రత ఉండదని అన్నారు. జగన్, కేసీఆర్, మోదీలు నాటకాలాడుతున్నారని దుమ్మెత్తిపోశారు. ఏపీకి వ్యతిరేకంగా వీరు ప్రవర్తిస్తున్నారని, ఇలాంటి వ్యక్తుల కారణంగా రేపు ఏపీకి ప్రాజెక్టుల నుంచి నీళ్లు కూడా రావని, రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు.