Hindupuram: అనూహ్యంగా వచ్చిన టికెట్... హిందూపురం వైసీపీ అభ్యర్థి పరిస్థితి ఇప్పుడు డోలాయమానం!
- అనంతపురంలో సీఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్
- వైసీపీలో చేరడంతో హిందూపురం టికెట్
- రాజీనామాను ఇంకా ఆమోదించని అధికారులు
- నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం
గోరంట్ల మాధవ్... అనంతపురం ఎంపీ, తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డికి పోలీసుల సత్తా ఏంటో తెలిసేలా చేస్తానని సవాల్ విసిరిన వ్యక్తి. ఆపై తన సీఐ పదవికి రాజీనామా చేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరగా, ఆయనకు అనూహ్యంగా హిందూపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని వైఎస్ జగన్ కల్పించారు. అంతవరకూ బాగానే ఉంది. అయితే, ఆయన తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన నెలలు గడుస్తున్నా, ఇంతవరకూ అది ఆమోదం పొందలేదు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి, ఎన్నికల్లో నామినేషన్ వేస్తే, దాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరిస్తారన్న సంగతి తెలిసిందే. ఇదే ఇప్పుడు సమస్యగా మారింది.
గోరంట్ల మాధవ్ అనంతపురం జిల్లాలో సీఐగా ఇంకా పనిచేస్తున్నట్టుగానే రికార్డుల్లో ఉంది. తాను రాజీనామా చేసినా, దాన్ని ఆమోదించకుండా తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఈ ఉదయం మాధవ్ ఆరోపించారు. బీసీ అభ్యర్థిని కాబట్టే, తనను ఈ తరహాలో వేధిస్తున్నారని ఆయన అంటున్నారు. డీఐజీ నాగేంద్ర ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తాను విధుల్లో లేకున్నా, బలవంతంగా రికార్డుల్లో తన పేరును కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఏదిఏమైనా నామినేషన్ల పరిశీలనకు మరో ఆరేడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో, మాధవ్ పరిస్థితి డోలాయమానంలో పడగా, ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో వైసీపీ నాయకత్వం ఉందని సమాచారం.