kalyanadurgam: నా సత్తా ఏంటో చంద్రబాబు, దివాకర్ రెడ్డిలకు చూపిస్తా: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి
- హనుమంతరాయ చౌదరికి వ్యతిరేకంగా సర్వే రిపోర్టులు
- జేసీ ప్రోద్బలంతో ఉమామహేశ్వరనాయుడికి టికెట్ ఇచ్చిన చంద్రబాబు
- ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానన్న చౌదరి
రానున్న ఎన్నికల్లో తన సత్తా ఏంటో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిలకు చూపిస్తానని కళ్యాణదుర్గం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి అన్నారు. తనకు టికెట్ ఇవ్వకుండా పార్టీ తీరని ద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 25న ఇండిపెండెంట్ గా నామినేషన్ వేస్తానని చెప్పారు.
కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉమామహేశ్వరనాయుడు యర్రంపల్లి గ్రామంలోని హనుమంతరాయ చౌదరి నివాసంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పలువురు టీడీపీ సీనియర్ నేతలు ఉన్నారు. పార్టీ హైకమాండ్ తనకు టికెట్ ఇచ్చిందని, తన గెలుపుకు కృషి చేయాలని ఈ సందర్భంగా ఉమామహేశ్వరనాయుడు కోరారు. ఆయన విన్నపాన్ని తిరస్కరించిన మనుమంతరాయ చౌదరి... స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని తేల్చి చెప్పారు.
చంద్రబాబు చేయించుకున్న అంతర్గత సర్వే ఫలితాలు హనుమంతరాయ చౌదరికి వ్యతిరేకంగా వచ్చాయి. దీంతో, ఆయన స్థానంలో ఎవరిని బరిలోకి దింపాలనే విషయంపై చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేశారు. అనంతపురం పార్లమెంటు స్థానం పరిధిలో కళ్యాణదుర్గం నియోజకవర్గం ఉండటంతో ఎంపీ జేసీ రంగంలోకి దిగి, పావులు కదిపారు. కళ్యాణదుర్గంలో టీడీపీకి వ్యతిరేకంగా ఫలితం వస్తే, దాని ఫలితం పార్లమెంటు నియోజకవర్గంపై పడుతుందన్న భావనతో, చంద్రబాబును కలిసి ఈ సీటు వ్యవహారంపై చర్చించారు. ఉమామహేశ్వరనాయుడు పేరును ఆయన ప్రతిపాదించారు.
ఈ నేపథ్యంలో, ఉమాపై మరోసారి సర్వే చేయించి, దాని రిపోర్టును చంద్రబాబు పరిశీలించారు. అనంతరం ఉమామహేశ్వరనాయుడి పేరును ఖరారు చేశారు. తనకు టికెట్ ఖరారు కావడంతో ఉమా ప్రచార రంగంలోకి దిగారు. జేసీ అండదండలు ఉండటం ఆయనకు కలిసివస్తుందని విశ్లేషకులు అంటున్నారు.