Babu Rajendra Prasad: మేము అనని వాటిని అన్నట్టుగా జగన్ భ్రమపడుతున్నారు: బాబూ రాజేంద్రప్రసాద్
- పూర్తి స్థాయిలో డ్వాక్రా రుణమాఫీ చేశామని చెప్పలేదు
- ట్రాక్టర్లకి.. రోడ్డు, టోల్ ట్యాక్స్ ఎత్తేస్తానంటాడు
- రద్దు చేసిన వాటిని మళ్లీ ఎలా రద్దు చేస్తాడు?
తాము అనని వాటిని అన్నట్టుగా.. తాము చేయించిన వాటిని మళ్లీ చేయిస్తానంటూ వైసీపీ అధినేత జగన్ ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతున్నాడని టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ దుయ్యబట్టారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కొయ్యలగూడెం వెళ్లి డ్వాక్రా రుణమాఫీ చేశామని చెప్పి చంద్రబాబుగారు సన్మానం చేయించుకొచ్చారని జగన్ చెబుతున్నారు. మేమసలు పూర్తి స్థాయిలో డ్వాక్రా రుణమాఫీ చేశామని ఎప్పుడూ చెప్పలేదు. గతంలో మహిళలకు పసుపు-కుంకుమల కింద రూ.10వేలు ఇచ్చాం.. ఇప్పుడు మరో పది వేలు ఇస్తున్నాం అని మాత్రమే చెప్పాం. మేము అనని వాటిని అన్నట్టుగా భ్రమపడుతూ చెబుతున్నారు. మేము చేసేసిన వాటిని తాను చేయిస్తానంటాడు.
అన్నింటికన్నా హాస్యాస్పదం ఏమిటంటే.. ట్రాక్టర్లకి రోడ్డు ట్యాక్స్, టోల్ ట్యాక్స్ ఎత్తేస్తానని ఇప్పుడే ఆయన చెప్పడం జరిగింది. ఆల్‌రెడీ మేము ట్రాక్టర్లకీ, ఆటోలకి రోడ్డు ట్యాక్స్ రద్దు చేశాం. ట్రాక్టర్లకి టోల్ ట్యాక్స్ లేదు. మేము రద్దు చేసిన వాటిని ఆయన మళ్లీ ఎలా రద్దు చేస్తారు? ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్‌లో గందరగోళంలో మాట్లాడుతున్నారు. మేము రాత్రి పూట 9 గంటలపాటు విద్యుత్‌ను రైతులకు ఇస్తామని ఎప్పుడో చంద్రబాబు గారు చెప్పారు. మళ్లీ ఇప్పుడు జగన్ అదే మాట చెబుతున్నాడు. ఆయనకేమైనా మతి భ్రమించిందా? హాస్యాస్పదం ఏమిటంటే.. 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేస్తానంటున్నాడు. మేము ఆ చట్టాన్ని అమలు చేసే భూములు సేకరిస్తున్నాం. ఇలాగే ఏంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. భ్రమల్లో బతుకుతూ పగటి కలలు కనడం మానివేయాలని జగన్ గారిని కోరుతున్నాం’’ అని తెలిపారు.