KTR: రిటర్న్ గిఫ్ట్ ఏంటో ఏప్రిల్ 11 తర్వాత తెలుస్తుంది: చంద్రబాబుకి కేటీఆర్ కౌంటర్
- చంద్రబాబును ఇంటికి పంపిస్తారు
- మంత్రులేమీ బానిసలు కారు
- నిప్పులు చెరిగిన టీఆర్ఎస్ నేత
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో సోమవారం పార్టీ శ్రేణుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పచ్చి అవకాశవాదిలా మాట్లాడుతున్నారని, అవకాశం వస్తే మళ్లీ మోదీ సర్కారులో చేరతారని విమర్శించారు.
తన దగ్గర పనిచేసిన కేసీఆర్ అంటూ చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనం అని మండిపడ్డారు. అయినా మంత్రులేమీ ముఖ్యమంత్రులకు బానిసలు కారు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ విషయంలో చంద్రబాబు ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్... గతంలో చంద్రబాబు కాంగ్రెస్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేయలేదా? అని నిలదీశారు. అయినా, తెలుగుదేశం పార్టీని తానే స్థాపించినట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా విమర్శించారు.
ఫెడరల్ ఫ్రంట్ పై బాబు చేస్తున్న విమర్శలు అర్థరహితమని పేర్కొంటూ, జాతీయ పార్టీ పెడితే తప్పేముందని ప్రశ్నించారు. తమకు మహారాష్ట్ర ఎన్నికలపై ఎంత ఆసక్తి ఉంటుందో ఏపీలో ఎన్నికలపైనా అంతే ఆసక్తి ఉంటుందని, అంతమాత్రాన తామేదో జోక్యం చేసుకుంటున్నామని చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబును ఈ ఎన్నికల ద్వారా ఇంటికి పంపేందుకు అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, తామిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటో ఏప్రిల్ 11 తర్వాత తెలుస్తుందని కేటీఆర్ అన్నారు.