Police: నిన్న న్యూజిలాండ్... నేడు నెదర్లాండ్స్!.. విచ్చలవిడిగా కాల్పులు జరిపిన దుండగుడు
- ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కాల్పుల తర్వాత పారిపోయిన దుండగుడు
- ఉగ్రవాదిగా అనుమానం
న్యూజిలాండ్ మారణహోమం ఘటన మరువక ముందే నెదర్లాండ్స్ లో కాల్పుల ఘటనతో అంతర్జాతీయ సమాజం ఉలిక్కిపడింది. నెదర్లాండ్స్ లోని ఉట్రెక్ట్ నగరంలో ట్రామ్ లో ప్రయాణిస్తున్న వ్యక్తులపై ఓ దుండగుడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించగా, పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేవారితో ట్రామ్ రద్దీగా ఉన్న సమయంలో అందులోని ఓ వ్యక్తి పైకిలేచి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
ఊహించని విధంగా కాల్పులు చోటుచేసుకోవడంతో ప్రయాణికులు చెల్లాచెదురయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఉట్రెక్ట్ పోలీసులు వెంటనే ట్రామ్ వద్దకు చేరుకుని సహాయక చర్యలు ఆరంభించారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందినట్టు గుర్తించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కాగా, ఇది ఉగ్రవాద చర్యగా నెదర్లాండ్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. దుండగుడి కోసం నెదర్లాండ్స్ లో ప్రస్తుతం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు జరుగుతున్నాయి. డచ్ ప్రధాని మార్క్ రుట్టే సంకీర్ణ ప్రభుత్వ సమావేశం కూడా రద్దు చేసుకుని ప్రస్తుత పరిస్థితిని సమీక్షిస్తున్నారు.