High Court: నాకే లాయరూ వద్దు... నా కేసు నేనే వాదించుకుంటా: న్యూజిలాండ్ కాల్పుల కేసు నిందితుడు
- డ్యూటీ లాయర్ ను నియమించిన కోర్టు
- వద్దన్న నిందితుడు
- ఏమాత్రం కనిపించని పశ్చాత్తాపం
న్యూజిలాండ్ లో గత శుక్రవారం జరిగిన కాల్పుల ఘటన నిందితుడు బ్రెంటన్ టరాంట్ తన కేసును తానే వాదించుకుంటానని కోర్టుకు స్పష్టం చేశాడు. క్రైస్ట్ చర్చ్ నగరంలోని రెండు మసీదుల్లో టరాంట్ తుపాకీతో విచ్చలవిడిగా కాల్పులు జరిపి 49 మందిని బలిగొన్నాడు. కాగా, ఈ కేసు క్రైస్ట్ చర్చ్ డిస్ట్రిక్ట్ కోర్టులో విచారణకు వచ్చింది. బ్రెంటన్ టరాంట్ తరఫున వాదనలు వినిపించేందుకు న్యాయస్థానమే డ్యూటీ లాయర్ రిచర్డ్ పీటర్స్ ను టరాంట్ న్యాయవాదిగా నియమించింది.
అయితే, టరాంట్ తనకు ఏ లాయరూ అక్కర్లేదని, తన కేసును తానే వాదించుకుంటానని కోర్టుకు తెలిపాడు. ఈ సందర్భంగా క్రైస్ట్ చర్చ్ డ్యూటీ లాయర్ రిచర్డ్ పీటర్స్ మాట్లాడుతూ, టరాంట్ లో పశ్చాత్తాపం ఏమాత్రం లేదని, అతివాద ధోరణి కనిపిస్తోందని తెలిపారు. అయితే అతడు చాలా స్పష్టమైన భావాలు కలిగి ఉన్నా, హేతుబద్ధత లోపించినట్టుగా అనిపిస్తోందని పీటర్స్ వివరించారు. డిస్ట్రిక్ట్ కోర్టులో విచారణ అనంతరం ఏప్రిల్ 5 వరకు కస్టడీ విధించారు. తదుపరి విచారణ హైకోర్టులో జరగనుంది. టరాంట్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.