Pakistan: న్యూజిలాండ్ కాల్పుల హంతుకుడ్ని ఎదిరించిన వ్యక్తికి అవార్డు ప్రకటించిన పాక్ ప్రధాని
- నయీం రషీద్ కు మరణానంతర పురస్కారం
- తెగువకు గుర్తింపుగా అవార్డు
- పాక్ గర్విస్తోందన్న ఇమ్రాన్
న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ నగరంలో ఓ నరహంతకుడు సృష్టించిన మారణహోమం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. మసీదుల్లో ప్రార్థనలు జరుపుకుంటున్న ముస్లింలపై ఓ శ్వేతజాతీయుడు విచ్చలవిడిగా తుపాకీతో కాల్పులు జరిపి 49 మందిని పొట్టనబెట్టుకున్నాడు. మృతుల్లో తొమ్మిదిమంది పాకిస్థానీలు కూడా ఉన్నారు. వారిలో నయీం రషీద్ అనే వ్యక్తి ఎంతో ధైర్యసాహసాలతో హంతకుడ్ని ఎదిరించి ముందుకు వెళ్లాడు.
ఆ నరరూప రాక్షసుడ్ని నయీం ఎదిరిస్తున్న సమయంలో అనేకమంది సురక్షితంగా తప్పించుకోగలిగారు. ఓవైపు తన శరీరంలో తుపాకీ గుళ్లు దిగుతున్నా నయీం లెక్కచేయకుండా ముందుకు వెళ్లి హంతకుడితో కలబడేందుకు ప్రయత్నించాడు. కానీ, షార్ట్ రేంజ్ లో కాల్పులకు గురికావడంతో నయీం ప్రాణాలు కోల్పోయాడు. అతడు చూపించిన తెగువకు గుర్తింపుగా మరణానంతర అవార్డు ఇస్తున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఓ ప్రకటనలో తెలిపారు. నయీం రషీద్ సాహసం పట్ల పాక్ గర్విస్తోందని, అతడి ధీరత్వానికి గుర్తింపుగా జాతీయ అవార్డు ప్రకటించామని ఇమ్రాన్ వెల్లడించారు.