Chandrababu: ఆ దొంగను నమ్మొద్దు... అన్న ఒకే ఒక్క మాటతో వృద్ధురాలికి పాదాభివందనం చేసిన చంద్రబాబు
- విజయనగరం సభలో ఆసక్తికర దృశ్యం
- వృద్ధురాలి ఆవేశానికి ముగ్ధుడైన సీఎం
- ఆమె స్ఫూర్తి ఇతరులకు ఆదర్శం కావాలంటూ పిలుపు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో తలమునకలుగా ఉన్నారు. మార్చి 16 నుంచి ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్న ఆయన ఆదివారం విజయనగరం జిల్లాలో ప్రజాదర్బార్ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెంటమ్మ అనే వృద్ధురాలు చంద్రబాబునాయుడ్ని విశేషంగా ఆకర్షించింది. చంద్రబాబు తన ప్రసంగం ముగిసిన వెంటనే వేదిక నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. అదే సమయంలో పెంటమ్మ వేదికపైకి చేరుకుని గట్టిగా నినాదాలు చేయడం ప్రారంభించింది. "ఆ దొంగను నమ్మకండి... మీ ఓటును చంద్రబాబు నాయుడికే వేయండి. బాబు చేసిన మేలును మరువొద్దు. బాబునే గెలిపిద్దాం" అంటూ తన వయసును కూడా లెక్కచేయకుండా ఉత్సాహంగా అరిచింది. ఆమె మాటలకు చంద్రబాబు అచ్చెరువొందారు.
నిండు వృద్ధాప్యంలో ఉన్న వాళ్లు కూడా తన నాయకత్వంపై ఎంతో అభిమానం చూపిస్తుంటే ఆయన తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. అనంతరం ఆయన మళ్లీ మైక్ అందుకుని మాట్లాడుతూ, పెంటమ్మలో తనకు ఇవాళ రాష్ట్ర ప్రజల కసి కనిపిస్తోందని అన్నారు. ఆమె డబ్బుల కోసం రాలేదని, తెలుగుదేశం ప్రభుత్వం చేసిన మేలును గుర్తించమని ముందుకు వచ్చిందని, అందుకే ఆమెకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. వెంటనే పెంటమ్మ కాళ్లకు నమస్కరించారు. పెంటమ్మ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో కనిపించాలని ఆశిస్తున్నట్టు చెబుతూ, చంద్రబాబు తన ప్రసంగం ముగించారు.