Andhra Pradesh: వైసీపీకి ఓటేస్తే ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ ఉండదు!: చంద్రబాబు హెచ్చరిక

  • పరపతిలేనివాళ్లే టీడీపీని వీడుతున్నారు
  • చిన్నాన్న మరణాన్ని జగన్ రాజకీయం చేస్తున్నారు
  • టీడీపీ శ్రేణులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

ప్రజల్లో పరపతి లేనివాళ్లే టీడీపీని వీడి బయటకు పోతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. వీరంతా స్వప్రయోజనాల కోసం టీడీపీలో చేరారనీ, ఇప్పుడు స్వార్థంతో పార్టీని వీడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయంలో భాగంగానే పలువురు నేతలకు ఈసారి టికెట్లు ఇవ్వలేకపోయామని తెలిపారు.

అలాంటి నేతలందరూ ధైర్యంగా ఉండాలనీ, పార్టీ వారిని అన్నిరకాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అమరావతిలో టీడీపీ బూత్ స్థాయి కన్వీనర్లు, సేవామిత్రలు, ప్రజాప్రతినిధులతో ఏపీ సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మానవత్వం లేకుండా వైఎస్ వివేకానందరెడ్డిని హత్యచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నాన్న హత్యలో కూడా జగన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీకి ఓటేస్తే ధన, మాన, ప్రాణాలకు రక్షణ ఉండదని హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ నేతలు హత్యలు, దోపిడీలు చేస్తారని స్పష్టం చేశారు.

ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వైసీపీ ఎలాంటి దురాగతానికైనా తెగబడుతుందని వ్యాఖ్యానించారు. నేరస్తులు గెలిస్తే రాష్ట్రంలో పిల్లల భవిష్యత్ ఏం కావాలి? అని ప్రశ్నించారు. ఏపీ భవిష్యత్ ను 5 కోట్ల మంది ప్రజలే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

సొంత చిన్నాన్న మరణాన్ని జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తాన్ని పులివెందుల చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News