YSRCP: ప్రసాద్ కు వివేకాను చంపేంత ధైర్యం లేదు: డ్రైవర్ భార్య కృప
- ప్రసాద్ వివేకాను చంపేంత దుర్మార్గుడు కాదు
- లేఖ నిజం కాకపోవచ్చు
- అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రసాద్ భార్య
వైఎస్సార్సీపీ నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చిక్కుముడి వీడేట్టు కనిపించడంలేదు. ఉదయం హత్య జరిగితే వివేకా రాసినట్టుగా చెబుతున్న లేఖ సాయంత్రానికి బయటికి రావడం పలు సందేహాలకు తావిస్తోంది. ఆ లేఖలో తన డ్రైవర్ ప్రసాద్ పైనే వివేకా హత్యానేరం మోపినట్టుగా ఉందన్న వాదనల నేపథ్యంలో ఈ ఘటన చాలా సంక్లిష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే, ఘటనపై డ్రైవర్ ప్రసాద్ భార్య కృప, అతడి తల్లి మీడియాతో మాట్లాడారు. ఉదయాన్నే మామూలుగా డ్యూటీకి వెళ్లాడని, కానీ సాయంత్రానికి లేఖ దొరికిందంటూ పోలీసులు తీసుకెళ్లారని ఆందోళన వ్యక్తం చేసింది. తన భర్తకు హత్య చేసేంత ధైర్యంలేదని స్పష్టం చేసింది. వివేకానందరెడ్డిని కొట్టి చంపేంత దుర్మార్గుడు కాదని వివరించింది.
అయితే, ఉదయాన్నే డ్యూటీకి రమ్మన్నందుకు చచ్చేలా కొట్టాడంటూ ఆ లేఖలో ఉంది కదా అని మీడియా ప్రతినిధి డ్రైవర్ ప్రసాద్ భార్య కృపను ప్రశ్నించాడు. దానికామె బదులిస్తూ ఈ విషయాన్ని తాము నమ్మడం లేదని, లేఖ నిజం కాకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. రాత్రి 11 గంటలకు ఇంటికి చేరుకున్నాడని, దాంతో ఉదయాన్నే కొంచెం ఆలస్యంగానే రమ్మని వివేకా తన భర్తకు చెప్పినట్టు కృప మీడియాకు వివరించింది. అయితే ఉదయాన్నే వివేకానందరెడ్డి అల్లుడు ఫోన్ చేసిన తర్వాతే ప్రసాద్ వెళ్లాడని వెల్లడించింది. సాయంత్రం తన భర్తను పోలీసులు తీసుకెళ్లినట్టు తెలిసిందని వివరించింది.