YSRCP: అంకుల్ చనిపోతే ఇంత నీచంగా మాట్లాడుతున్నారేంటి?: వివేకా మృతిపై మంచు విష్ణు ఆవేదన

  • చావును కూడా రాజకీయాలకు వాడుకుంటారా?
  • మానవత్వం మురికి కాల్వలో కొట్టుకుపోతోంది
  • కనీస ఆలోచన కూడా ఉన్నట్టులేదు

వైఎస్సార్సీపీ నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబానికి మంచు విష్ణుకు బంధుత్వం ఉన్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు భార్య విరానికా దివంగత వైఎస్సార్ సోదరుడి కుమార్తె కావడంతో వైఎస్ ఫ్యామిలీకి, మంచు వారి కుటుంబానికి మధ్య వియ్యం ఏర్పడింది. అయితే, వైఎస్ వివేకా శుక్రవారం దారుణహత్యకు గురైన నేపథ్యంలో మంచు విష్ణు చలించిపోయాడు. తండ్రి మోహన్ బాబుతో కలిసి వివేకా భౌతికకాయాన్ని సందర్శించిన విష్ణు విషాదానికి లోనయ్యాడు. అనంతరం, తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. వివేకా హత్య తర్వాత జరుగుతున్న పరిణామాలపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంచు విష్ణు, కొందరి మాటలు వింటుంటే మానవత్వం మురికి కాలువల్లో కొట్టుకుపోతున్న భావన కలుగుతోందని అన్నాడు.

వివేకా అంకుల్ మృతిపై వినిపిస్తున్న మాటలు ఎంతో నీచంగా ఉన్నాయని, ఆయన హత్యను ఖండించాల్సింది పోయి జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారని విమర్శించాడు. మరణాన్ని సైతం రాజకీయాలకు ఉపయోగించుకుంటున్న వైనం చూస్తుంటే వీళ్లకు అసలు ఆవగింజంతైనా బుర్ర ఉందా? అనిపిస్తోందని అసహనం వ్యక్తం చేశాడు. అంతకుముందు, మోహన్ బాబు కూడా ఈ విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా ఎంతో మంచివాడని ఇతర రాజకీయపార్టీల వాళ్లే చెబుతుంటారని, అలాంటి వ్యక్తిని చంపాల్సిన కారణం ఏంటని ప్రశ్నించారు. జరుగుతున్న ఘోరాలను పై నుంచి భగవంతుడు గమనిస్తూనే ఉంటాడని మోహన్ బాబు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News