Australia: 'న్యూజిలాండ్' రక్తపిశాచి కాల్పులకు ముందు ఏమన్నాడో తెలుసా..?
- వెలుగులోకి కొత్తకోణం
- కుర్రాళ్లకు సందేశం ఇచ్చిన హంతకుడు
- పార్టీ చేసుకుందాం అంటూ కాల్పులు
పసిఫిక్ మహాసముద్రంలో ప్రకృతి అందాలకు పెట్టింది పేరైన న్యూజిలాండ్ ద్వీపం చరిత్రలో మార్చి 15 ఓ దుర్దినం అని చెప్పాలి. తుపాకీ చేతబూనిన బ్రెంటన్ టరాంట్ అనే ఆస్ట్రేలియా జాతీయుడు క్రైస్ట్ చర్చ్ నగరంలోని రెండు మసీదుల్లో మారణహోమం సృష్టించాడు. విచ్చలవిడిగా జరిపిన కాల్పుల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. కాల్పులను టరాంట్ ఫేస్ బుక్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేయడం దిగ్భ్రాంతి కలిగించింది. తన కాల్పులకు ముందు ప్రపంచ యువతకు ఓ సందేశం ఇచ్చాడు టరాంట్. "కుర్రాళ్లూ! ఇక పార్టీ మొదలుపెడదాం.... కానీ, ప్యూడైపై యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రయిబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు" అంటూ పిలుపునిచ్చాడు. ఆ మరుక్షణమే రాక్షసుడిలా మారి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు.
ఇక, టరాంట్ పేర్కొన్న ప్యూడైపై యూట్యూబ్ చానల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలోనే అత్యధిక సబ్ స్క్రయిబర్లున్న చానల్ (8.9 కోట్లు) ఇదే. దీని అధినేత స్వీడన్ కు చెందిన ఫెలిక్స్ జెల్ బెర్గ్. అయితే, జెల్ బెర్గ్ వ్యవహారశైలి చాలాకాలంగా వివాదాస్పదమవుతోంది. తన యూట్యూబ్ చానల్ లో యూదు వ్యతిరేక వీడియోలు, జాతివిద్వేషాన్ని పెంపొందించే వీడియోలు పోస్టు చేస్తున్నాడంటూ విమర్శలు వస్తున్నాయి. కానీ, అత్యధిక సబ్ స్క్రయిబర్లు ఉండడంతో ఈ యూట్యూబ్ చానల్ కు కళ్లు చెదిరే ఆదాయం వచ్చిపడుతోంది. ఇందులో ఒక వీడియో యాడ్ ఇవ్వాలంటే ఆయా సంస్థలు జెల్ బెర్గ్ కు రూ.3.10 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, న్యూజిలాండ్ నరమేధానికి పాల్పడిన టరాంట్ ప్యూడైపై చానల్ ను ప్రోత్సహిస్తూ మాట్లాడడంతో జెల్ బెర్గ్ తీరుపై ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. విద్వేషాన్ని రెచ్చగొట్టే వీడియోల కారణంగానే టరాంట్ వంటి అతివాదులు హింసకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి.