Andhra Pradesh: కర్నూలులో ఉద్రిక్తత.. టీడీపీ నేత తిక్కారెడ్డిపై వేటకొడవళ్లతో దాడిచేసిన వైసీపీ నేతలు!

  • మంత్రాలయం మండలం ఖగ్గలులో ఘటన
  • టీడీపీ జెండా ఆవిష్కరించి ప్రచారం ప్రారంభించిన తిక్కారెడ్డి
  • జెండాను తొలగించి వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే బాలయోగి వర్గీయులు

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న వైసీపీ అధినేత జగన్ చిన్నాన్నను గుర్తుతెలియని దుండగులు హతమార్చగా, ఈరోజు కర్నూలు జిల్లాలో టీడీపీ నేత తిక్కారెడ్డిపై ప్రతిపక్ష వైసీపీకి చెందిన నేతలు వేటకొడవళ్లతో దాడిచేశారు. ఈ ఘటనలో టీడీపీ నేత తిక్కారెడ్డితో పాటు ఏఎస్ఐకి గాయాలయ్యాయి. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జిల్లాలోని మంత్రాలయం మండలం ఖగ్గల్ గ్రామంలో ఈరోజు టీడీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేత తిక్కారెడ్డి జెండాను ఆవిష్కరించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అంతలోనే అక్కడకు చేరుకున్న వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి భార్య, ప్రదీప్ రెడ్డి తమ అనుచరులతో కలిసి టీడీపీ జెండాను తొలగించి వాగ్వాదానికి దిగారు. పరిస్థితి చేయిదాటడంతో తిక్కారెడ్డి వర్గంపై వేటకొడవళ్లతో విరుచుకుపడ్డారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి రణరంగంగా మారింది.

ఈ సందర్భంగా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ దాడిలో తిక్కారెడ్డితో పాటు మాధవరం ఏఎస్ఐ వేణుగోపాల్ కాళ్లలో బుల్లెట్లు దూసుకుపోయాయి. దీంతో అధికారులు వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ పరిస్థితి చేయిదాటకుండా భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.

  • Loading...

More Telugu News