Lok Sabha: కొలిక్కి వచ్చిన టీడీపీ అధినేత కసరత్తు...లోక్‌సభ అభ్యర్థుల జాబితా రెడీ!

  • నేడు  తిరుపతిలో ప్రకటించనున్న చంద్రబాబు
  • తొలివిడత 15 మంది అభ్యర్థుల జాబితా
  • తిరుపతి నుంచి పనబాకకు అవకాశం

అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ఇప్పటికే విడుదల చేసి రేసులో ముందున్న తెలుగుదేశం పార్టీ ఈరోజు  లోక్‌సభ అభ్యర్థులను  ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.  ఇందుకు సంబంధించిన కసరత్తు పూర్తయిందని, తొలివిడత 15 మంది పేర్లు వెల్లడించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి శుక్రవారమే ఈ జాబితా విడుదల చేయాల్సి ఉన్నా వై.ఎస్‌.వివేకా హత్య నేపథ్యంలో ఒక రోజు వాయిదా వేశారు. రాజమండ్రి, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి స్థానాల అభ్యర్థులు దాదాపు ఖరారైనట్టే. వీటికి అదనంగా ఇప్పటికే కొందరు సిట్టింగ్ లకు బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

రాజమండ్రి నియోజకవర్గం నుంచి తిరిగి పోటీ చేసేందుకు సినీనటుడు మురళీమోహన్‌ ఆసక్తి చూపించక పోవడంతో ఆయన స్థానంలో ఆయన కోడలు రూపను పోటీకి దించాలని చంద్రబాబు నిర్ణయించారు. మురళీమోహన్‌ అనాసక్తితో ఈ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, వ్యాపారవేత్త మూర్తి పేర్లు పరిశీలించినప్పటికీ చివరికి రూపవైపే చంద్రబాబు మొగ్గుచూపినట్టు సమాచారం.

నెల్లూరు నుంచి పోటీ చేసేందుకు మొదటి నుంచి ఆసక్తితో ఉన్న బీద మస్తాన్‌రావుకే సీఎం టికెట్టు ఖరారు చేశారు. ఒంగోలు నుంచి పోటీ చేసేందుకు అయిష్టత చూపిన మంత్రి శిద్ధా రాఘవరావు చంద్రబాబు మాట్లాడిన తర్వాత అంగీకరించడంతో ఆయన స్థానం ఖరారైంది.

ఇటీవలే కాంగ్రెస్‌ నుంచి వచ్చి చేరిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని తిరుపతి నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ స్థానం కోసం తాజా మాజీ ఐఏఎస్‌ అధికారి రామాంజనేయులు పేరు కూడా పరిశీలనకు వచ్చినప్పటికీ, రాజకీయ సమీకరణాల నేపధ్యంలో పనబాక వైపు బాబు మొగ్గు చూపినట్లు సమాచారం. నంద్యాలలో ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులతోపాటు శివానందరెడ్డి పోటీ పడుతున్నా శివానందరెడ్డికే అవకాశం కనిపిస్తోంది.

అలాగే, విశాఖ స్థానానికి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, సీనియర్‌ నాయకురాలు ముళ్లపూడి రేణుక, అమలాపురం స్థానానికి లోక్‌సభ మాజీ స్పీకర్‌ బాలయోగి తనయుడు హరీష్‌మాథుర్‌, మాజీ ఎంపీ హర్షకుమార్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీటిపై రేపటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News