Telangana: కాంగ్రెస్ పార్టీకి మరో దెబ్బ.. కేటీఆర్ తో కొత్తగూడెం ఎమ్మెల్యే భేటీ.. త్వరలో టీఆర్ఎస్ లో చేరిక!
- కేటీఆర్ తో వనమా వెంకటేశ్వరరావు సమావేశం
- టీఆర్ఎస్ లో చేరికపై సంసిద్ధత వ్యక్తంచేసిన నేత
- సానుకూలంగా స్పందించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆత్రం సక్కు, రేగ కాంతారావు, లింగయ్య సహా పలువురు నేతలు కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఖమ్మం జిల్లా నుంచి మరో నేత హస్తం పార్టీని వీడి కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు.
ఖమ్మం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత వనమా వెంకటేశ్వరరావు ఈరోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని ప్రగతిభవన్ కు తన కుమారులతో కలిసి చేరుకున్న వనమా.. జిల్లాలో రాజకీయాలు, పార్టీ పరిస్థితిపై ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ లోకి చేరేందుకు వనమా ఆసక్తి చూపగా, కేటీఆర్ సాదరంగా స్వాగతించినట్లు సమాచారం.
దీంతో త్వరలోనే వనమా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని ఆయన సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. తాజా పరిణామాలతో తెలంగాణ అసెంబ్లీలో 12గా ఉన్న కాంగ్రెస్ బలం ఇప్పుడు 11కు పడిపోనుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ విపక్ష హోదాను కోల్పోనుంది. అంతేకాకుండా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు ఇకపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో సాటు, కోడెం వీరయ్య మాత్రమే మిగులుతారు.