YS Viveka: వివేకా ఇంటికి డాగ్ స్క్వాడ్ ను తెచ్చిన పోలీసులు!

  • స్నానాల గదిలో విగతజీవిగా కనిపించిన వైఎస్ వివేకా
  • ఐపీసీ సెక్షన్ 175 కింద కేసు నమోదు
  • పోస్టుమార్టం నివేదిక తరువాత విచారణ

నిన్నంతా ప్రజల మధ్య ఉత్సాహంగా కనిపించి, ఇంటికెళ్లి స్నానాల గదిలో విగతజీవిగా కనిపించిన వైఎస్ వివేకా మరణంపై పోలీసుల విచారణ ప్రారంభమైంది. ఆయన పడివున్న ప్రాంతంలో రక్తపు మరకలు కనిపించడంతో, డాగ్ స్క్వాడ్ ను రప్పించారు ఉన్నతాధికారులు. వివేకా మృతిపై ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బాత్ రూములో ఆయన కాలుజారి పడివుండవచ్చని, ఆ సమయంలో తలకు దెబ్బ తగిలివుండవచ్చని భావిస్తున్నా, పోలీసులు మాత్రం ఐపీసీ సెక్షన్ 175 కింద కేసు నమోదు చేశారు.

పోలీసులు వచ్చేసరికే ఆయన ఇల్లు బంధువులు, కార్యకర్తలతో నిండిపోవడంతో డాగ్ స్క్వాడ్ వల్ల ఉపయోగమేమీ ఉండక పోవచ్చని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం వివేకా మృతదేహానికి పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం జరుగుతోంది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత కేసు విచారణను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశాన్ని పరిశీలిస్తామని కడప ఎస్పీ వెల్లడించారు.

కాగా, ఇటీవల వివేకాకు గుండెపోటు రాగా, ఆయన స్టెంట్ వేయించుకున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఆయన రక్తపోటుతోనూ బాధపడుతున్నారు. 68 ఏళ్ల వయసున్న ఆయన, పైకి కనిపించేంత ఆరోగ్యంగా ఏమీ లేరని అభిమానులు అంటున్నారు.

YS Viveka
Heart Attack
Blood
Police
Dog Squad
  • Loading...

More Telugu News