Chandrababu: వారసులొచ్చారు... టీడీపీ తొలి జాబితాలో ఆసక్తికర విశేషాలు!
- 10 మంది వారసులకు టికెట్లు
- 72 మంది ఓసీలకు సీట్లిచ్చిన చంద్రబాబు
- 31 మంది బీసీలు, 17 మంది ఎస్సీలకు చాన్స్
నిన్న రాత్రి 126 మందితో టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబునాయుడు ప్రకటించిన తొలి జాబితాలో రాజకీయ నేతల వారసులకు పెద్ద పీట వేశారు. మొత్తం పది మంది వారసులకు చోటు లభించింది. వీరిలో సీఎం తనయుడిగా మంగళగిరి నుంచి లోకేశ్ బరిలోకి దిగనున్నారు. మిగతా వారసులు ఎవరన్న సంగతి పరిశీలిస్తే, పలాస నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గౌతు శివాజీ కుమార్తె శిరీషకు చోటు లభించింది. చీపురుపల్లి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మృణాలిని కుమారుడు కిమిడి నాగార్జున, రాజమండ్రి అర్బన్ నుంచి ఎర్రన్నాయుడు కుమార్తె, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు ఆదిరెడ్డి భవానీ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
గుడివాడ నుంచి దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్, విజయవాడ వెస్ట్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూస్, పత్తికొండ నుంచి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యామ్, రాప్తాడు నుంచి మంత్రి పరిటాల సునీత వారసుడిగా పరిటాల శ్రీరామ్ రంగ ప్రవేశం చేశారు. శ్రీకాళహస్తి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డి, నగరి నుంచి దివంగత గాలి ముద్దుకృష్ణమనాయుడి కుమారుడు గాలి భాను ప్రకాశ్ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా రాజకీయాల్లో కాలుమోపారు.
కాగా, తొలి జాబితాలో సిట్టింగ్ లకు చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ జాబితాలో 72 మంది ఓసీలు, 31 మంది బీసీలు, 17 మంది ఎస్సీలు, నలుగురు ఎస్టీ, ఇద్దరు మైనార్టీలకు చోటు లభించింది.