Cricket: టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీపై చార్జిషీట్
- భార్య ఫిర్యాదుతో కొంతకాలంగా ఇబ్బందులు
- తాజాగా ఐపీసీ 498ఏ కింద చార్జిషీట్
- కొన్ని తీవ్ర అభియోగాల తొలగింపు
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి గతకొంతకాలంగా భార్య హసీన్ జహాన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు వచ్చిన నేపథ్యంలో జహాన్ తన భర్త షమీపై దారుణమైన ఆరోపణలు చేయడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు నేపథ్యంలో, తాజాగా కోల్ కతా పోలీస్ డిపార్ట్ మెంట్ మహిళల గ్రీవెన్స్ సెల్ షమీపై సెక్షన్ ఐపీసీ 498ఏ, సెక్షన్ 354ఏ కింద చార్జిషీట్ నమోదు చేసింది. వీటిలో 498ఏ సెక్షన్ ఓ మహిళపై భర్త కానీ, ఇతర బంధువులు కానీ హింసకు పాల్పడిన సందర్భాల్లో ఉపయోగిస్తారు. 354ఏ సెక్షన్ ను ఓ మహిళ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినప్పుడు ప్రయోగిస్తారు.
అయితే, షమీకి ఊరట కలిగించే విషయం ఏమిటంటే... ఈ కేసులో తొలుత నమోదు చేసిన ఎఫ్ఐఆర్ నుంచి సెక్షన్ 307, సెక్షన్ 376 అభియోగాలను తొలగించారు. వీటిలో 307 హత్యాయత్నంకు సంబంధించినది కాగా, 376 అత్యాచారానికి సంబంధించిన సెక్షన్. వరల్డ్ కప్ లో పాల్గొనే జట్టులో షమీ కూడా ఉంటాడన్న నేపథ్యంలో తాజా చార్జిషీట్ సమస్యాత్మకంగా మారే అవకాశముందని తెలుస్తోంది.