masood azhar: మసూద్ అజర్ ను అప్పగించి ఇమ్రాన్ తన చిత్తశుద్ధిని చాటుకోవాలి: సుష్మా స్వరాజ్

  • పుల్వామా ఘటన తర్వాత పాక్ ఆందోళన చెందుతోంది
  • ఇమ్రాన్ ఔదార్యంతో వ్యవహరిస్తున్నారని కొందరు అంటున్నారు
  • పుల్వామా తరహా ఘటన మరోసారి జరిగితే.. చూస్తూ ఊరుకోం

ఉగ్రవాదం, చర్చలు రెండూ కలసి ముందుకు సాగవని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. ఉద్రిక్తతలను నివారించడానికి భారత్ శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని, ఇదే సమయంలో పాకిస్థాన్ నుంచి సరైన చర్యలను భారత్ ఆశిస్తోందని చెప్పారు.

పుల్వామా దాడుల తర్వాత భారత్ మరింత తీవ్రంగా స్పందిస్తుందని పాకిస్థాన్ ఆందోళన చెందుతోందని సుష్మ అన్నారు. పుల్వామా దాడులను ఖండిస్తూ పలు దేశాల విదేశాంగ మంత్రులు తనకు ఫోన్ చేసి, సంఘీభావాన్ని ప్రకటించారని తెలిపారు. ఇదే సమయంలో పరిస్థితి మరింత తీవ్రతరం కాకుండా చూడాలని కోరారని సుష్మ చెప్పారు. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా భారత్ అన్ని చర్యలు తీసుకుంటుందని తాను వారికి చెప్పానని తెలిపారు. ఇదే సమయంలో, పుల్వామా తరహా ఘటన మరోసారి చోటుచేసుకుంటే... తాము చూస్తూ ఊరుకోబోమని చెప్పానని అన్నారు.

ఉగ్రవాదం లేని వాతావరణం కోసం పాకిస్థాన్ తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధమని చెప్పారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజనీతజ్ఞుడిగా చాలా ఔదార్యంతో వ్యవహరిస్తున్నారని కొందరు అంటున్నారని... జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను భారత్ అప్పగించి ఇమ్రాన్ తన చిత్తశుద్ధిని చాటుకోవాలని అన్నారు. అప్పుడే ఆయనలో ఎంత ఉదారత ఉందో అర్థమవుతుందని చెప్పారు.

masood azhar
sushma swaraj
pakistan
india
pulwama
  • Loading...

More Telugu News