India: ఎంత వేగంతో వచ్చాయో అంతకు రెట్టింపు వేగంతో పరారైన పాక్ విమానాలు
- ఎల్వోసీ వద్ద పాక్ యుద్ధ విమానాల అలజడి
- సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణం
- అప్రమత్తమైన భారత దళాలు
పాకిస్థాన్ తన కవ్వింపు చర్యలను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా, రెండు పాకిస్థాన్ యుద్ధ విమానాలు నియంత్రణ రేఖ వద్ద అలజడి సృష్టించాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు సమీపంలో పూంచ్ సెక్టార్ వద్ద ఈ విమానాలు సూపర్ సోనిక్ వేగంతో వచ్చి వెళ్లాయి. మంగళవారం రాత్రి ఎల్వోసీ వద్దకు వాయువేగంతో వచ్చిన ఈ విమానాలు భారత వాయుసేన రాడార్లు గుర్తించే లోపే తిరిగి పాకిస్థాన్ గగనతలంలోకి జారుకున్నాయి.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పందించే లోపే ఆ విమానాలు కంటికి కనిపించనంత దూరం వెళ్లిపోయాయి. ఈ సమయంలో సమీప గ్రామాల ప్రజలకు భారీ శబ్దాలు వినిపించాయి. కాగా, భారత వాయుసేన రాడార్లపై విమానాల రాక స్పష్టంగా కనిపించింది. దాంతో సరిహద్దు వెంబడి ఉన్న అన్ని ఎయిర్ బేస్ లలో హైఅలర్ట్ ప్రకటించారు. ఫిబ్రవరి 27న పాక్ యుద్ధ విమానాలు భారత సైనిక స్థావరాలపై దాడికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే.