Cricket: చివరి వన్డేలో టీమిండియా ఓటమి... సిరీస్ విజేత ఆసీస్
- ఐదో వన్డేలో 35 రన్స్ తో గెలిచిన కంగారూలు
- 3-2తో సిరీస్ కైవసం
- ఓటమితో సిరీస్ ముగించిన కోహ్లీ సేన
మరికొన్ని రోజుల్లో వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఓటమితో సిరీస్ ముగించింది టీమిండియా. ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన ఐదో వన్డేలో టాపార్డర్ వైఫల్యం కారణంగా భారత్ పరాజయం చవిచూసింది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో తొలి రెండు వన్డేలు ఓడినా ఆసీస్ పట్టుదలతో పుంజుకుని ఏకంగా సిరీస్ ను ఎగరేసుకెళ్లింది. వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచి వరల్డ్ కప్ ముంగిట ఆత్మవిశ్వాసం దక్కించుకుంది. సిరీస్ 2-2తో సమమైన నేపథ్యంలో ఢిల్లీ ఆతిథ్యమిచ్చిన చివరి వన్డేలో ఆసీస్ 35 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించింది.
273 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 237 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ బ్యాటింగ్ లోనూ రాణించి 46 పరుగులు చేశాడు. కేదార్ జాదవ్ 44 పరుగులు చేసినా ఆసీస్ బౌలర్లు పట్టుదలగా బౌలింగ్ చేయడంతో లక్ష్యఛేదన కష్టసాధ్యంగా మారింది. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 3, కమిన్స్, స్టొయినిస్, రిచర్డ్ సన్ రెండేసి వికెట్లతో కోహ్లీసేన పనిబట్టారు. అంతకుముందు, మొదట బ్యాటింగ్ చేసిన కంగారూలు 9 వికెట్లకు 272 పరుగులు చేశారు.