Chandrababu: మోదీ చౌకీదార్ నని చెప్పుకుంటూ ఈ దొంగలకు కాపలా కాస్తున్నారు: చంద్రబాబు మండిపాటు
- సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తామన్నారు
- ఇప్పుడు స్కామాంధ్ర చేశారు
- ఆర్ధిక ఉగ్రవాదులతో చేతులు కలిపారంటూ ధ్వజం
గత ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, చివరికి ఆర్థిక ఉగ్రవాదులతో చేతులు కలిపారని ఏపీ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. తిరుపతి సభలో మోదీ మాట్లాడుతూ ఏపీ ప్రజల ముందు ఇప్పుడు రెండే రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని అన్నారని గుర్తుచేశారు చంద్రబాబు.
'సీమాంధ్రను స్వర్ణాంధ్రను చేసుకుంటారా? లేక స్కామాంధ్రను చేసుకుంటారా?' అని అడిగారు. 'స్వర్ణాంధ్రను చేసుకోవాలనుకుంటే నాకు మద్దతు ఇవ్వండి... నాపైన భరోసా ఉంచండి' అన్నారు. గుజరాత్ ప్రజలకంటే ఆంధ్రులు తెలివైన వాళ్లు, రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్ ఉంది అన్నారు. 'కానీ ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి మోదీ గారూ? కుట్రదారులతో చేతులు కలిపి రాష్ట్రాన్ని స్కామాంధ్ర చేశారు. చౌకీదార్ నని చెప్పుకుంటూ ఈ దొంగలకు కాపలా కాస్తున్నారు' అంటూ నిప్పులు చెరిగారు. బుధవారం సాయంత్రం అమరావతిలోని ప్రజావేదిక వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.