Telangana: కేసీఆర్ గచ్చిబౌలి దివాకర్ అయితే... కాంగ్రెస్ సచిన్ టెండూల్కర్!: రేవంత్ రెడ్డి ఫన్నీ కామెంట్లు
- తెలంగాణ రాజకీయాలు వార్ జోన్ లో ఉన్నాయి
- కాంగ్రెస్ కు బలం ఉన్నా కేసీఆర్ ఎమ్మెల్సీని నిలబెట్టారు
- సీఎల్పీ ఆఫీసులో మీడియాతో కాంగ్రెస్ నేత
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు వార్ జోన్ లో ఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీ కోసం తాను పోరాడుతాననీ, ఇది తన బాధ్యతగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. సంప్రదాయాల పేరిట కాంగ్రెస్ మద్దతు కోరిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బలం ఉన్నప్పటికీ అభ్యర్థిని పోటీకి ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే లోక్ సభ ఎన్నికల్లో ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల్లో పార్టీ గెలిచినా, ఓడినా కార్యకర్తల్లో ధైర్యం, ఆత్మస్థైర్యం నింపాల్సిన అవసరం కాంగ్రెస్ ముఖ్యనేతలపై ఉందని అభిప్రాయపడ్డారు. '2014 లోక్ సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ, మూడు నెలల తర్వాత జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోలేదా? ఏదైనా జరగొచ్చు' అన్నారు. కేసీఆర్ గచ్చిబౌలి దివాకర్ అయితే.. కాంగ్రెస్ పార్టీ సచిన్ టెండూల్కర్ అని రేవంత్ రెడ్డి సరదాగా వ్యాఖ్యానించారు.