Andhra Pradesh: ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు!: వైసీపీ నేత సి.రామచంద్రయ్య
- రాజకీయ లబ్ధికి తెలుగురాష్ట్రాల మధ్య చిచ్చు
- జేడీ ద్వారా జగన్ ను బాబు జైలులో పెట్టించారు
- ఇప్పుడు జేడీకి మేలు చేసేందుకు యత్నిస్తున్నారు
రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ఏపీ సీఎం చంద్రబాబు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని వైసీపీ నేత సి.రామచంద్రయ్య విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు వ్యతిరేకంగా కేంద్రం పనిచేయలేదన్న అక్కసుతోనే చంద్రబాబు ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చారని ఆరోపించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో సి.రామచంద్రయ్య మాట్లాడారు.
ఏపీ సీఎం చంద్రబాబు అప్పటి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ద్వారా జగన్ ను జైలులో పెట్టించారని రామచంద్రయ్య ఆరోపించారు. అందుకే ఇప్పుడు జేడీ టీడీపీలో చేరుతారని వార్తలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న అవినీతి లక్ష్మీనారాయణకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబుకు జేడీ లక్ష్మీనారాయణ సహకరించినందున, ఇప్పుడు చంద్రబాబు ఆయనకు మేలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
గతంలో సోనియా గాంధీ, జగన్ ఒకటేనన్న చంద్రబాబు ఇప్పుడేమో మోదీ, జగన్ ఒక్కటేనని ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు మీడియాను నమ్ముకుంటే జగన్ ప్రజలను నమ్ముకున్నారని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడికి ఇవే చివరి ఎన్నికలని జోస్యం చెప్పారు.