IT Grids: డేటా చౌర్యం కేసు.. ప్రధాన నిందితుడు అశోక్ నేడు సిట్ విచారణకు హాజరవుతాడా?
- నోటీసులకు స్పందించని అశోక్
- సోమవారం ఆయన ఇంటికి నోటీసులు అంటించిన అధికారులు
- నేడు విచారణకు హాజరు కాకుంటే చట్టపరమైన చర్యలు
డేటా చౌర్యం కేసులో ప్రధాన నిందితుడైన అశోక్ నేడు తెలంగాణ సిట్ ఎదుట నేడు విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఆయన వస్తాడా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత అశోక్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ కేసు దర్యాప్తు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ మాదాపూర్‌లోని ఐటీ గ్రిడ్స్ యజమాని అశోక్‌ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన అధికారులు తమ ఎదుట హాజరు కావాల్సిందిగా ఈ నెల 2, 3 తేదీల్లో నోటీసులు జారీ చేశారు. అయితే, అప్పటికే అజ్ఞాతంలో ఉన్న అశోక్ వాటికి స్పందించలేదు. దీంతో సోమవారం మరోమారు నోటీసులు జారీ చేసిన అధికారులు కేపీహెచ్‌బీలోని ఆయన ఇంటికి వాటిని అతికించారు. బుధవారం గోషామహల్‌లోని సిట్ కార్యాలయంలో హాజరు కావాలని అందులో పేర్కొన్నారు.
అయితే, సిట్ విచారణకు ఆయన హాజరవుతారా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది. ఐటీ గ్రిడ్, బ్లూఫ్రాగ్ సంస్థల్లో ఇప్పటికే సోదాలు నిర్వహించిన పోలీసులు పలు ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా, నేడు అశోక్ కనుక విచారణకు హాజరు కాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు యోచిస్తున్నారు.