Chandrababu: నా దగ్గర పనిచేసిన కేసీఆర్ కే ఇంత రోషం ఉంటే నాకెంత ఉండాలి?: చంద్రబాబు ఫైర్
- ఏపీ డేటాతో నీకేంపని?
- నువ్వో పెద్ద నాయకుడివి!
- నీ ఆటలు ఏపీలో సాగవంటూ సీఎం హెచ్చరిక
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విజయవాడలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆవేశపూరితంగా ప్రసంగించారు. ఘంటా మురళి పార్టీలో చేరిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఆయన తన ప్రసంగం ఆద్యంతం కేసీఆర్, జగన్, మోదీ త్రయంపై నిప్పుల వర్షం కురిపించారు.
తెలంగాణ సీఎం ఓ పెద్ద నాయకుడిలా మాట్లాడుతున్నాడని, ఏపీ డేటాతో తనకేం పని? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీ డేటా పోతే బాధపడాల్సింది తామని, కానీ కేసీఆర్ కు బాధ కలుగుతోందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెలంగాణలో 27 లక్షల ఓట్లు తీసేయిస్తే ఎవరూ మాట్లాడలేదని, కానీ ఏపీలో కూడా అదే తరహాలో దౌర్జన్యం చేయాలనుకుంటున్నాడని, కానీ ఆయన ఆటలు ఇక్కడ సాగవన్న విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
"నువ్వేదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటున్నావు, కానీ నీకు 100 రిటర్న్ గిఫ్ట్ లు ఇచ్చే సత్తా నాకుంది. నా దగ్గర పనిచేసిన నీకే ఇంత రోషం ఉంటే నాకెంత ఉండాలి? హైదరాబాద్ లో ఇవాళ ఆదాయం వస్తోందంటే అది నీ శ్రమ కాదు, మా కష్టార్జితం" అంటూ మండిపడ్డారు చంద్రబాబు.