Tollywood: దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్

  • నర్సీపట్నం వైసీపీ అభ్యర్థిగా ఉమా శంకర్
  • పూరీ ప్రచారం చేసే అవకాశం
  • జగన్ పార్టీలో పెరుగుతున్న సినీ గ్లామర్

వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీలో సినీ గ్లామర్ నానాటికీ పెరిగిపోతోంది. ఇప్పటికే కొందరు  టాలీవుడ్ తారలు వైసీపీలో చేరారు. స్టార్ కమెడియన్ అలీ కూడా సోమవారం నాడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరో కమెడియన్ పృథ్వీ ఇంతకుముందే పార్టీలో చేరడంతో పాటు కీలక పదవిని కూడా సంపాదించుకున్నారు. ఈ క్రమంలో వైసీపీకి మరికాస్త సినీ టచ్ అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా, పార్టీ అధినేత జగన్ అసెంబ్లీ అభ్యర్థులను ఎంపిక చేస్తూ నర్సీపట్నం టికెట్ ను పి. ఉమాశంకర్ కు కేటాయించారు. ఉమాశంకర్ ఎవరో కాదు టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు. పూరీ జగన్నాథ్ కు సాయిరామ్ శంకర్, ఉమాశంకర్ గణేష్ సోదరులు.

సాయిరామ్ శంకర్ తన అన్నతో పాటు సినీ రంగంలో ఉండగా, ఉమాశంకర్ స్వగ్రామంలో ఉంటూ రాజకీయాలపై దృష్టి పెట్టారు. కొంతకాలంగా వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఉమాశంకర్ కు జగన్ టికెట్ ఖరారు చేసినట్టు తెలిసింది. పూరీ జగన్నాథ్ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. గతంలో పూరీ జగన్నాథ్ తల్లి సత్యవతి సర్పంచ్ గా కూడా పోటీచేశారు. ఇక ఉమాశంకర్ ఇప్పటివరకు నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీ కన్వీనర్ గా ఉన్నారు. సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ వచ్చిన నేపథ్యంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News