India: ఇథియోపియా ప్రమాదం నేపథ్యంలో బోయింగ్ సంస్థ నుంచి సమాచారం సేకరిస్తున్న భారత్
- స్పైస్ జెట్, జెట్ ఎయిర్ వేస్ వద్ద బోయింగ్ విమానాలు
- డీజీసీఏ ఆందోళన
- బోయింగ్ ఇచ్చే సమాచారం ఆధారంగా భద్రత చర్యలు
ఇథియోపియాలో విమాన ప్రమాదం జరిగి 157 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆదివారం అడిస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబీ వెళుతున్న బోయింగ్ బీ737 మ్యాక్స్ విమానం బిషోప్తు వద్ద కూలిపోయింది. అయితే, బోయింగ్ బీ737 మ్యాక్స్ రకానికి చెందిన విమానం కూలిపోవడం కొన్నినెలల వ్యవధిలోనే ఇది రెండోసారి. 2018 అక్టోబరు 29న ఇండోనేషియాకు చెందిన లయన్ ఎయిర్ విమానం జావా సముద్రంలో కూలిపోయిన ఘటనలో 189 మంది మరణించారు. అది కూడా బోయింగ్ తయారీ బీ737 మ్యాక్స్ కావడంతో ఆ తరహా విమానాల సాంకేతికతపై సందేహాలు కలుగుతున్నాయి.
భారత్ కు చెందిన డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. భారత్ లో ఈ తరహా విమానాలను స్పైస్ జెట్, జెట్ ఎయిర్ వేస్ విమానయాన సంస్థలు ఉయోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీజీసీఏ బోయింగ్ సంస్థ నుంచి బీ737 మ్యాక్స్ విమానాల పూర్తి సాంకేతిక సమాచారాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. నిర్దిష్ట సమాచారం అందిన తర్వాత ఆయా విమానాల్లో అవసరమైన భద్రత పరమైన చర్యలు తీసుకుంటామని డీజీసీఏ చీఫ్ బీఎస్ భుల్లర్ చెప్పారు.