Andhra Pradesh: వైసీపీ కండువా కప్పుకోనున్న అలీ!
- జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం
- అలీని స్వయంగా ఆహ్వానించనున్న వైసీపీ అధినేత!
- ఎక్కడ నుంచి పోటీచేసే అంశంపై తొలగని సస్పెన్స్!
టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన అధినేతలను కలిసిన అలీ ప్రత్యక్ష రాజకీయాల్లో రంగప్రవేశానికి వైసీపీనే సరైన వేదిక అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సోమవారం ఉదయం లోటస్ పాండ్ లో పార్టీ అధినేత జగన్ సమక్షంలో అలీ వైసీపీ సభ్యత్వం స్వీకరించనున్నారు.
జగన్ సోమవారం నాడు కాకినాడలో సమర శంఖారావం సభకు వెళ్లాల్సి ఉండడంతో, ఉదయమే అలీ పార్టీలో చేరే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అలీని పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం జగన్ కాకినాడ పయనం అవుతారు. జగన్ పాదయాత్రలో ఉన్న సమయంలో కూడా అలీ స్వయంగా వెళ్లి ఆయనను పరామర్శించారు.
అలీ వైసీపీలో చేరుతున్నాడని అప్పట్లోనే కలకలం రేగినా, ఆ తర్వాత వరుసగా చంద్రబాబు, పవన్ లను కూడా కలవడంతో వైసీపీలో చేరిక వార్తలకు పెద్దగా బలం చేకూరలేదు. కానీ, గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న అలీకి టీడీపీలో తగిన హామీ దొరకలేదని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. అయితే, వైసీపీలో చేరుతున్న అలీ ఎక్కడ నుంచి పోటీచేస్తారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.