Andhra Pradesh: టీడీపీని వీడుతున్నారన్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఏరాసు ప్రతాప్ రెడ్డి!

  • పాణ్యం టికెట్ పై కొనసాగుతున్న రగడ
  • గౌరు దంపతుల చేరికతో ఏరాసు అసంతృప్తి
  • రేపు చంద్రబాబుతో సమావేశం కానున్న నేత

వైసీపీ నేతలు గౌరు చరితా రెడ్డి దంపతులు ఇటీవల టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఈసారి గౌరు చరితారెడ్డికి పాణ్యం టికెట్ ను ఇస్తారని హమీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. చంద్రబాబు నిర్ణయంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఏరాసు ప్రతాప్ రెడ్డి నిన్న జరిగిన పార్టీ సమావేశానికి డుమ్మా కొట్టారు. దీంతో ఆయన త్వరలోనే టీడీపీకి రాజీనామా చేస్తారని వార్తలు హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై ప్రతాప్ రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడారు.

కర్నూలు జిల్లాలోని పాణ్యం అసెంబ్లీ టికెట్ ఇంకా ఎవరికీ ఖరారు కాలేదని ప్రతాప్ రెడ్డి తెలిపారు. తనకు పార్టీ మారే ఆలోచన ప్రస్తుతానికి అయితే లేదని స్పష్టం చేశారు. రేపు ఏపీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబును కలుసుకుంటానని వెల్లడించారు. ఆయనతో భేటీ అనంతరం ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు.

ఏరాసు ప్రతాప్ రెడ్డి 1994లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. అదే నియోజకవర్గం నుంచి 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయం సాధించారు. మళ్లీ ఆత్మకూరు నుంచి కాంగ్రెస్ టికెట్ పై 2004లో గెలుపొందారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీశైలం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. ఏపీ విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన ఏరాసు.. 2014లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

  • Loading...

More Telugu News