Andhra Pradesh: ఫోన్లు చేసి వేధిస్తున్న వారిపై యామిని సాధినేని పోలీసులకు ఫిర్యాదు
- నా మొబైల్ నంబర్ తెలుసుకున్నారు
- అర్ధరాత్రి ఫోన్లు చేసి విసిగిస్తున్నారు
- హద్దుమీరితే చర్యలే
కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కొందరు వ్యక్తులు తన ఫోన్ నంబర్ తెలుసుకుని దాన్ని ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారని యామిని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్ధరాత్రి వేళ కూడా తనకు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కొంటే మంచిదేనని, కానీ ఇలా వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలని చూస్తే ఎవరినీ వదిలిపెట్టబోనని హెచ్చరించారు.
ఎంతో భవిష్యత్తు ఉన్న యువత ఇలాంటి విపరీత ధోరణులకు దూరంగా ఉండాలని హితవు పలికారు యామిని. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సాధారణమైన విషయమేనని, కానీ సైబర్ చట్టాలపై అవగాహన లేని కొందరు, అవగాహన ఉన్నా ఏమవుతుందిలే అని మరికొందరు విపరీతంగా ట్రోలింగ్ కు పాల్పడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి ఆరోపించారు. ట్విట్టర్ లో తనపై ట్రోలింగ్ కు పాల్పడుతున్నవారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో కోరారు.