Prabhakar Rao: ఏపీయే మాకు బాకీ పడింది.. పైగా మాపై అసత్య ప్రచారం చేస్తోంది!: ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు

  • సమన్వయం కొరవడినట్టుంది
  • మేము ఇచ్చేది డబ్బు కాదంటున్నారు
  • లా ట్రైబ్యునల్‌ను సంప్రదించడమేంటి?
  • ఏం చేసినా పారదర్శకంగానే చేస్తాం

ఏపీ విద్యుత్ సంస్థలు తమకు బకాయి పడటమే కాకుండా, తమపై అసత్య ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఆరోపించారు. నేడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీలో విద్యుత్ సంస్థలకూ, ప్రభుత్వానికీ మధ్య సమన్వయం కొరవడినట్టుందని అన్నారు.

తెలంగాణే తమకు రూ.5,600 కోట్లు ఇవ్వాల్సి ఉందని ఏపీ విద్యుత్ సంస్థలంటున్నాయని, కానీ అన్ని లెక్కలు చూశాక తెలంగాణ ప్రభుత్వానికే ఏపీ రూ.2,046 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. తాము ఎన్ని లేఖలు రాసినా పట్టించుకోకుండా లా ట్రైబ్యునల్‌ను సంప్రదించడమేంటని ప్రభాకర్‌రావు నిలదీశారు.

'ఏపీ ఇచ్చేదేమో డబ్బు.. మేము ఇచ్చేది మాత్రం డబ్బు కాదంటున్నారు' అని పేర్కొన్నారు. నాణ్యమైన విద్యుత్ అందించాలంటే.. కొనుగోలు తప్పనిసరి అని, తాము ఏం చేసినా పారదర్శకంగానే చేస్తామని ప్రభాకర్ రావు తెలిపారు. ఏపీ డిస్కంల నుంచి రూ.1659 కోట్లు, ఏపీ జెన్‌కో నుంచి రూ.3096 కోట్లు మొత్తంగా రూ.5785 కోట్లు తెలంగాణకు రావాల్సి ఉందని ప్రభాకర్ తెలిపారు. లెక్కలు సరిచూసుకుని తాము డబ్బు చెల్లించాల్సి వస్తే చెల్లించేందుకు సిద్ధమన్నారు. ఏపీ ప్రభుత్వం ముందుకు వస్తే సమస్యల పరిష్కారానికి తాము సిద్ధమన్నారు.

Prabhakar Rao
Transco CMD
Andhra Pradesh
Law Tribunal
Telangana
  • Loading...

More Telugu News