Kamal Haasan: కమలహాసన్ పార్టీలో చేరిన సినీ హాస్య నటి కోవై సరళ!

  • చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఎంఎన్ఎం తీర్థం
  • కోవై సరళ సేవలు వినియోగించుకుంటామన్న కమల్
  • పార్టీ విజయానికి కృషి చేస్తానన్న నటి

ప్రముఖ హాస్య సినీ నటి కోవై సరళ రాజకీయ అరంగేట్రం చేశారు. కమలహాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీలో ఆమె ఈరోజు చేరారు. ఈ సందర్భంగా కోవై సరళకు కండువా కప్పిన కమల్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం చెన్నైలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎంఎన్ఎం సభ్యత్వాన్ని కోవై సరళకు అందజేశారు. ఈ సందర్భంగా కోవై సరళ మాట్లాడుతూ.. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఎంఎన్ఎం తరఫున ప్రచారం చేస్తానని తెలిపారు. పార్టీ విజయం కోసం కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

అనంతరం కమలహాసస్ స్పందిస్తూ.. కోవై సరళ సేవలు ప్రస్తుతం పార్టీకి అవసరమని అన్నారు. మక్కల్ నీది మయ్యం బలోపేతానికి ఆమె సహకారం తీసుకుంటామని తెలిపారు. కాగా, కోవై సరళ చేరిక నేపథ్యంలో కోయంబత్తూరు, కొంగునాడు ప్రాంతాల్లో పార్టీకి లబ్ధి చేకూరుతుందని ఎంఎన్ఎం వర్గాలు భావిస్తున్నాయి. కోవై సరళ-కమల్ జోడీగా నటించిన సతీలీలావతి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో 750కిపైగా సినిమాల్లో ఆమె నటించారు.

Kamal Haasan
kollywood
kovai sarala
join
mnm
  • Loading...

More Telugu News