Telugudesam: ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డదారులు వెతుకుతున్న టీడీపీ: జీవీఎల్ ఆరోపణలు
- ఓట్ల తొలగింపు అందులో భాగమే
- టీడీపీ చర్యలపై ఫిర్యాదు
- పోలీసులు అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు
రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో తిరిగి అధికారం చేజిక్కించుకునేందుకు తెలుగుదేశం పార్టీ అడ్డదారులు వెతుకుతోందని, తమకు వ్యతిరేకమైన ఓట్ల తొలగింపు అందులో భాగమేనని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్.నరసింహారావు ఆరోపించారు. రాష్ట్రంలోని పోలీసులు అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తూ వారి చర్యలకు మద్దతు పలుకుతున్నారని ధ్వజమెత్తారు.
ఓట్ల తొలగింపుపై ఈరోజు సీఈసీకి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నిబంధనలకు తూట్లు పొడిచే విధంగా టీడీపీ వ్యవహరిస్తోందన్నారు. ఫారం-7 ఎవరైనా ఇవ్వవచ్చని, అది నిజమైనదా, కాదా? అన్న విషయాన్ని ఎన్నికల సంఘం తేలుస్తుందని చెప్పారు. ఆధార్, ఓటరు డేటాను దొంగిలించి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడంపై సీఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు.